Friday, September 28, 2012

Dr. Chelikani Rama Rao డాక్టర్ చెలికాని రామారావు


Dr. Chelikani Rama Rao
(15-07-1901 - 25-09-1985)
డాక్టర్ చెలికాని రామారావు (1901-1985) 20 వ శతాబ్దపు భారతదేశ చరిత్రలోని ఉజ్వల అధ్యాయాలకు ప్రతీకగా నిలుస్తారు. మానవత, నిజాయితీ, వినమ్రత,విస్పష్టమైన నిబద్ధత మొదలైన విశిష్ట లక్షణాలతో ఆయన తన కాలంనాటి సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. వివేకానందుని బోధనలు, బ్రహ్మ సమాజ ఉద్యమం, రఘుపతి వెంకటరత్నం గారి శిష్యరికం, స్వతంత్ర పోరాటం, జైలు జీవితం, హరిజనసేవ, స్త్రీ జనోద్దరణ, కమ్యూనిస్టు ఉద్యమం, పార్లమెంటు సభ్యత్వం, వైద్యసేవ మొదలైన అంశాలకు ఆయన ఒక వాహిక లాగా నిలవడమే గాక వాటిపై తనదైన ముద్ర వేశారు.

ఈయన జులై 15, 1901లో నారాయణస్వామి, సూరమ్మ దంపతులకు జన్మించా
రు. 1921, జనవరి 26న కార్యదీక్షకై గృహపరిత్యాగం చేసారు. 1921 లోనే చదువుకు స్వస్తి చెప్పి జాతీయ ఉద్యమంలో చేరారు. 1922లో రాజమండ్రిలో మొదటిసారి జైలు శిక్షను అనుభవించారు. 1924లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రేసు మహాసభలో వాలంటరీ కమాండర్ గా పనిచేసారు.
1926-30 నిజాం సంస్థానంలో LM &S చదువుతున్నప్పుడు , అక్కడి సంస్కరణోద్యమాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1931లో డాక్టరు డిగ్రీ పట్టా పొందారు. 1934 లో కమలమ్మగారితో పరిచయం. కాకినాడలో వైద్యవృత్తిని నిర్వహించారు. ఇంకా జిల్లా హరిజన సంఘ అద్యక్షులుగా 1935 లో వ్యవహరించారు. ఈయన డాక్టరుగా 1937 నుండి రంగూన్లో ఉన్నారు. 1948-1952లలో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టము ప్రకారం అరెస్టు కాబడి, కడలూరు జైలులో శిక్ష అనుభవించారు. 1952లో కాకినాడ పార్లమెంటు సభ్యునిగా తొలి లోక్‌సభకు సి.పి.ఐ (కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా) అభ్యర్ధిగా ఎన్నికైనారు. 1957, 1962లలో తిరిగి కాకినాడ నియోజకవర్గము నుండి సి.పి.ఐ అభ్యర్ధిగా లోక్‌సభకు పోటీచేసినా గెలుపొందలేదు. రామారావు 84 సంవత్సరాల నిండైన సార్థక జీవితాన్ని గడిపి సెప్టెంబరు 25,1985న దివంగతులైనారు.

(వికీపీడియా నుండి)

************************

ఒక్క క్షణం....

....వారు తన జీవితాన్నంతనూ దేశ ఔన్నత్యానికి, ప్రజాసేవకు, సంఘసంస్కరణకు, సాంఘిక న్యాయానికి అంకితం చేశారు. వారు ఆదర్శమైన జాతీయవాది, మానవతావాది, కమ్యూనిష్టు.

నేడు జాతీయోద్యమ విలువలు వెనుకపట్టు పట్టినవి. డబ్బు, అధికారం అనేవి రాజకీయ జీవితాన్ని కలుషితం చేస్తున్నవి. దేశం ఎదుర్కొన్న ఇట్టి పరిస్థితుల్లో డాక్టర్ చెలికాని రామారావు గారి ఆదర్శజీవితాన్ని స్మరించుకోవటం ఎంతైనా అవసరం.

చండ్ర రాజేశ్వరరావు
14-10-1992

(బి.వి.వి బాలకృష్ణ రచించిన ‘డాక్టర్ చెలికాని రామారావు జీవితం’ (ఒక రాజకీయ పరిశిలన) గ్రంధానికి చండ్ర రాజేశ్వరరావు వ్రాసిన ముందు మాటలు ఇవి...)

********************************


......ప్రతి దేశానికి వాళ్ళకు ఉన్న భౌగోళిక, చారిత్రక పరిస్థితులనుబట్టి వాళ్ళ ఆదర్శాలు ఉంటాయి. అయితే మన ఆదర్శం ఏమిటి?
గత కొద్ది సంవత్సరాలుగా మన ఆదర్శం చాలా హీనస్థితిలో కనిపిస్తున్నది. దగా, హత్య, దేశద్రోహం, ఏమైనా చేయి! డబ్బు సంపాదించు! అదే ఆదర్శం..అనే విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి.
మనవంటి సువిశాలమైన, కోట్లజనాభా కలిగిన, వెనుకబడిన, బీదదేశానికి అది ఎప్పటికీ ఆదర్శం కారాదు.
అయితే మన ఆదర్శం ఏమిటి?
మన ఆదర్శం త్యాగం, మానవసేవయే మాధవ సేవ అన్న గౌతమ బుద్ధుడు, అలాగే సర్వ మానవ సమానత్వం, ప్రేమ బోధించిన సలీంచిస్తీలు, నిజాముద్దీను ఆలియాలు, సర్వమత సర్వప్రాణి సమానత్వాన్ని జాతీయతను ప్రబోధించిన వివేకానందుడు,మానవత్వమే మతమని చాటిచెప్పిన తల్లి ధెరిసా, అన్నిటికన్నా త్యాగానికి ప్రతీకైన మహాత్మా గాంధీ..
వారు ఏ విలువలకు ప్రతినిధులో ఆ విలువలకు సమస్తాన్ని త్యాగం చేసి, ఈదేశంలో లక్షలమంది నిలిచారు. కొందరు కొన్నే కొంతకాలమే చేశారు. బహుకొద్దిమంది చాలాకాలం అన్ని త్యాగాలు చేశారు.

ఈ బహుకొద్ది మందిలో డాక్టర్ రామారావుగారు ఒకరు.

డాక్టర్ రామారావుగారి చరిత్ర భారతదేశ చరిత్రలోని అత్యుత్తమ అధ్యాయానికి ఒక ఉదాహరణ, మచ్చుతునక.
ఆయన ప్రపంచంలోని మంచినంతా చూడగలిగారు, ఆచరించగలిగారు.
ఎంతటి అదృష్టం! వివేకానందుడి ప్రభావం, పిఠాపురం రాజావారి ప్రభావం, సంఘ సంస్కరణోద్యమ ప్రభావం, రఘుపతి వెంకటరత్నంగారి ప్రభావం,

గాంధీగారి ప్రభావం, బెంగాలు ఆంధ్ర విప్లవకారుల ప్రభావం, సరోజినీ నాయుడు ప్రభావం, మార్కిస్టు సిద్ధాంతాల ప్రభావం, యిన్నిటి సమ్మిశ్రమం డాక్టర్ రామారావుగారు. వీటన్నిటిలోనుండి కొట్టవచ్చినట్లు కనిపించే గొప్ప మానవతావాదం, ప్రాణాన్నికూడా లెక్కచేయనంతటి గొప్ప త్యాగగుణం, సమాజంలో ఉంటూనే సమాజాన్ని తన వ్యక్తిత్వంతో మార్పు చేయగలిగిన మహామనీషి.........

-డాక్టర్ గరిగిపాటి రుద్రయ్య చౌదరి
(డాక్టర్ బి.వి.వి బాలకృష్ణ రచించిన ‘డాక్టర్ చెలికాని రామారావు జీవితం’-ఒక రాజకీయ పరిశీలన ,అన్న గ్రంధానికి ప్రముఖ చరిత్ర పరిశోధకులు, విద్యావేత్త డాక్టర్ గరిగిపాటి రుద్రయ్య చౌదరి వ్రాసిన ‘ముందుమాట’ నుంచి..) ************************

First Lok Sabha
Members Bioprofile
RAO, DR. CHELIKANI VENKATA RAMA, L.M.S., Comm.(Madras—Kakinada—1952): S. of Shri Narayana Swamy;B. Kondevaram, East Godavari District, July 15, 1901; ed. at R. Ch. High School, Pithapuram, P.R. College, Kakinada and Osmania Medical College, Hyderabad; m. Dr. Ch. Kamalamma, 1934; 1 S.; Medical Practitioner; Worked in Congress, 1920—40; Worked for Harijan uplift, 1935—37; Imprisoned for participating in Congress Movement 1922-23, 1930, 1931, 1932-33.
Special interest: Public Health.
Permanent address: Ramachandrapuram, East Godavari District. 

Source: Lok Sabha Records 
 మంచి కమ్యూనిస్టు డా. చెలికాని రామారావు 

రచన : అదృష్ట దీపక్

"పురుషులందు పుణ్యపురుషులు వేరయా" అని కవివాక్కు.ఇటీవల మరణించిన స్వాతంత్ర్య సమరయోధుడు, మహోన్నత మానవతావాది డాక్టర్ చెలికాని రామారావు అలాంటి పుణ్యపురుషులలో ఒకరు. తాను నమ్మిన ఆశయాలను మనసా వాచా కర్మణా ఆచరించి తరువాత తరాలకు ఆదర్శప్రాయుడైన మహానుభావుడు ఆయన.తన దగ్గర వైద్యం చేయించుకున్న బీదసాదల నుంచి ఏవిధమైన రుసుమూ తీసుకోకుండా ఖర్చులకోసం తిరిగి వారికే కొంత డబ్బు ముట్టచెప్పేవారు. మూర్తీభవించిన సౌజన్యంతో జీవితంలో కడదాకా కష్టజీవుల అభ్యున్నతికోసం కృషిచేసిన డాక్టర్ రామారావు గారు చరిత్రలో ఒక "లిజెండరీఫిగర్" గా నిలిచిపోతారు.

1901 జులై 15 వ తేదీన తూర్పు గోదావరిజిల్లా కొండెవరంలో జన్మించిన చెలికాని రామారావుగారి జీవితం చిన్నతనంనుంచీ ఒక క్రమబద్ధమైన పరిణామపధంలో పయనించింది. ‘మానవ సేవయే మాధవ సేవ’గా భావించి భారతీయ తాత్వికతకు కొత్త అర్ధాలు సంతరింపచేసిన వివేకానందుని బోధనలచేత అతి పిన్న వయస్సులోనే డాక్టర్ చెలికాని ఉత్తేజాన్ని స్పూర్తినీ పొందారు. తరువాత రోజుల్లో సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు ఆయనను బాగా ఆకర్షించాయి. తెలుగునాట సాంఘిక విప్లవానికి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాయకత్వం వహించిన కందుకూరి వీరేశలింగం పంతులు కూడా ఆయనను ఎంతగానో ప్రభావితం చేశారు. కందుకూరి దగ్గర పెరిగిన డాక్టర్ కమలమ్మను రామారావు గారు కులాంతర వివాహం చేసుకున్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో మహాత్మ గాంధీ ఆయనను బాగా ఆకర్షించారు. ఆయన ప్రభావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన డాక్టర్ రామారావు గారి జీవితంలో సంభవించిన విప్లవ పరిణామక్రమంలో చివరకు ఆదర్శ కమ్యూనిస్టుగా మారారు.

1921 లో కాకినాడ కళాశాలలో చదువుతుండగా గాంధీజీ పిలుపునందుకొని బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్కూళ్ళు, కోర్టులు బహిష్కరిస్తూ సాగిన సత్యాగ్రహ ఉద్యమంలోకి ప్రవేశించారు. రామారావుగారు స్వతంత్ర పోరాటంలోకి దూకడం ఇంట్లో పెద్దవారికి యిష్టంలేదు. ఆ సందర్భంలో ఆయన సహాయ నిరాకరణోద్యమంలో పాలుపంచుకోవడానికి ఇల్లు విడిచి వెళ్ళిపోతూ వారి పెద్ద అన్నయ్యగారికి 25-1-1921 తేదీన రాసిన ఒక ఉత్తరంలోని ఈక్రింది భాగాలను గమనిస్తే డాక్టర్ చెలికాని చిత్తశుద్ధి, ఉద్యమంపట్ల వారి అవగాహన మనకు అర్ధమవుతాయి.

"నేను ఎవరిదైనా ఉపన్యాసము వినికానీ, ఏదో వ్యాసము చదివి కానీ ఆలోచించకుండగ ఇందులో ప్రవేశించిన వాడనుకాదు. ఈ ఉద్యమము గూర్చి పరిశీలించగా క్రమముగా నాకు కలిగినదేకాని ఒకరు చెప్పినది కాదు....సహాయ నిరాకరణము దేశమంతటికి సంబంధించిన విషయము. జీవిత పరమావధిని గూర్చి తలచిన యెడల ఒక మహోద్యమమునకు మానవుని జీవితము సమర్పించుట బహుసార్ధకము. ...కష్టములు లేకుండా గొప్ప కార్యక్రములు సాధింపజాలము. ఈ కష్టములన్నియు ఇతరులమీద మోపుట తప్పు. ఎవరికివారు ధర్మమని తోచిన యెడల పూనుకొని పనిచేయవలెను.. ....నాకు డబ్బు అక్కరలేదు. రేపు పిఠాపురం నుండి రైలు మీద వెళ్ళుటకంటె నాశక్తి మీద ఆధారపడి నడచిపోవుట మంచిదగుటచే తెల్లవారుజామున బయలుదేరుచున్నాను."

తన ఉద్యమ ప్రవేశం గురించి రామారావుగారు ఒక ఇంటర్ వ్యూలోఇలా చెప్పారు. "నేను 1921 జనవరి ఒకటవ తేదీన కాకినాడలో స్వతంత్ర పోరాటంలో చేరాను. అంతకుముందు ఏ నాయకులను కలువలేదు. ఏ సభలకు వెళ్ళలేదు. ఈ శతాబ్ద ప్రారంభం నుంచి 1921 వరకు జరిగిన విషయాలే నన్ను పురికొల్పాయి. ముఖ్యంగా వందేమాతరం ఉద్యమంలో జరిగిన సంఘటనల గురించి పెద్దవాళ్ళు చెప్పగా విన్న విషయాలూ, గాంధీ మహాత్ముడు శాంతియుతంగా సత్యాగ్రహ ఆయుధంతో మొదలుపెట్టిన పోరాటమూ నన్ను ఉత్తేజితుడ్ని చేశాయి."

డాక్టర్ చెలికాని 1922 మార్చి నెలలో చట్టధిక్కరణ నేరానికి ఒక సంవత్సరం రాజమండ్రి జైలులో నిర్భంధించబడ్డారు. అక్కడ నీలకంఠ బ్రహ్మచారి అనే విప్లవకారునితో పరిచయమైంది.అతని ద్వారానే రామారావుగారు రష్యా విప్లవం గురించీ లెనిన్ గురించీ ముఖ్యమైన విషయాలెన్నో తెలుసుకున్నారు.

జైలు నుంచి విడుదలయ్యాక బులుసు సాంబమూర్తి, మొసలికంటి తిరుమలరావుగార్లతో కలిసి జిల్లా కాంగ్రెస్ సంఘం అభివృద్ధికి ఆయన ఎంతో కృషిచేశారు. ప్రభుత్వంవారు కాకినాడలో బంగారువారి సత్రంలో ఉండే పట్టణ కాంగ్రెస్ కార్యాలయాన్ని రూపుమాపి, ఎవరైనా కాంగ్రెస్ ఆఫీసుకు ఇల్లు ఇస్తే ఆ యింటి యజమానికి జైలు శిక్ష విధింపబడుతుందని దండోరా వేయించారు. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో శ్రీమతి పెద్దాడ కామేశ్వరమ్మ, వేదాంతం వెంకట కృష్ణయ్య మొదలైన వారితో కలసి రామారావుగారు ధైర్యంగా కాంగ్రెస్ ఆఫీసు తిరిగి ప్రారంభించారు. 1923 లో కాకినాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెసు మహాసభల ఆహ్వాన సంఘంలో ప్రధానమైన బాధ్యతలు నిర్వహించారు. 1925 నుంచి ఉదృతంగా ఖాదీ ప్రచారంలో కూడా పాల్గొన్నారు. జాతీయ దృక్పధంతో విద్యనేర్పాలనే ఉద్దేశ్యంతో బందరులో స్థాపించబడ్డ జాతీయ కళాశాల నిధులకోసం చందాలు వసూలుచేశారు.
1930 లో హైదరాబాదు మెడికల్ కాలేజీలో చదువుతూ 15 రోజులలో పరీక్షలున్నా లక్ష్యపెట్టకుండా- కాలేజి వదలిపెట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమంలో బులుసు సాంబమూర్తి, దుర్గాబాయ్ దేశ్ ముఖ్, మొసలికంటి తిరుమలరావు గార్లతో కలిసి పనిచేశారు. 1930-31 శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని కాకినాడలో హిందూ స్థానీ సేవాదళ్ శిక్షణాశిబిరానికి కెప్టెన్ గా ఉండి చట్టధిక్కరణ నేరానికి తిరిగి ఒకటిన్నర సంవత్సరాలు రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించారు. అప్పుడు బెంగాలీ డిటెన్యూలతో పరిచయం ఏర్పడింది. వారిదగ్గర కమ్యూనిస్టు మూలసూత్రాల గురించి వివరంగా తెలుసుకుని ఆ సిద్ధాంతాల వలన ఎంతో ప్రభావితులయ్యారు.

డా.రామారావు తూర్పు గోదావరి జిల్లాలో హరిజన ఉద్యమంలో కూడా ఎంతొ చురుకుగా పనిచేశారు. 1935 నుంచి జిల్లా హరిజన సేవా సంఘానికి అద్యక్షులుగా ఉన్నారు. జిల్లాలో మొట్టమొదటి హరిజన హాస్టల్ ను నిర్వహించారు. అప్పటిలో ఆయన మద్దూరి అన్నపూర్ణయ్య వంటి కాంగ్రెస్ సోషలిస్టు పార్టీకి చెందిన ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలిగి వుండేవారు.

1939 లో సుభాస్ చంద్రబోస్ కాకినాడ వచ్చినప్పుడు గాంధీ అనుయాయులంతా ఆయన రాకను వ్యతిరేకించారు. అప్పుడు బోస్ సభకు రామారావు గారు హాజరై ఆసభ విజయవంతంగా జరిగేందుకు తోడ్పడ్డారు. తరువాత డాక్టర్ చెలికాని కమ్యూనిస్టుగా మారి రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. 1940 లో రామచంద్రపురంలో వైద్య వృత్తిలో స్థిరపడి ప్రజాసేవ చేస్తూ దీనజన బాంధవుడిగా పేరుపొందారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వంటి ప్రముఖ నాయకులెందరో రామారావుగారి యింట్లో ఆశ్రయం పొందారు. అనేకమంది పార్టీ ముఖ్యులు నెలల తరబడి వైద్యసహాయం పొందారు.

స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో కూడా డాక్టర్ గారికి నిర్భంధం తప్పలేదు. కడలూరు జైలులో పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్షలు చేసినప్పుడు తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచెయ్యకుండా రాత్రింబవళ్ళు వారి గురించి ఎంతో శ్రమపడ్డారు. జైలులో కూడా ఆనాటి రాజకీయ ఖైదీల న్యాయమైన హక్కులకోసం పోరాటాలు సాగించారు. స్వాతంత్ర్యోద్యమకాలంలోనూ, ఆ తరువాత కాలంలోనూకూడా డాక్టర్ చెలికాని అనేక సంవత్సరాలు రాజమండ్రి, బళ్ళారి, కోరాపుట్, కడలూరు జైళ్ళలో తీవ్ర నిర్భంధానికి గురై ఆరోగ్యాన్ని కోల్పోయారు. గేస్ట్ర్రిక్ అల్సర్
కి గురైన డాక్టర్ గారికి ఒకసారి పెద్ద ఆపరేషన్ జరిగింది.

తరువా
కాలంలో క్షయవ్యాధితో పాడైన ఒక ఊపిరితిత్తిని తొలగించారు. ఈరెండు ఆపరేషన్లూ శారీరకంగా డాక్టర్ రామారావు గారిని ఎంతో దెబ్బతీశాయి. అయినా ఆయనలోని విప్లవ కార్యదీక్ష ఏమాత్రం కుంటుపడలేదు.

1952
లో జరిగిన ఎన్నికలలో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా పోటీచేసి గెలుపొందారు.
అనారోగ్యంతో శానిటోరియంలో ఉన్న రామారావుగారు ప్రచారంలో పాల్గొనక పోయినా ఆ ఎన్నికలలో మొసలికంటి తిరుమలరావు, బులుసు సాంబమూర్తి మొదలైన హేమాహేమీలపై విజయం సాధించారు. శ్రామికజన పక్షపాతిగా ఆయన తనవాణిని లోక్ సభలో సమర్ధవంతంగా వినిపింపచేశారు. సభ దృష్టికి ఆయన తీసుకువచ్చిన ఎన్నోసమస్యలకు సంబంధించి పండిట్ నెహ్రూ వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.
డాక్టర్. చెలికానికి - తన వచన కవితా సంపుటి "ప్రాణం"అంకితమిస్తున్న అదృష్టదీపక్

1956లో లోక్ సభ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ నాయకత్వంలో చైనా పర్యటించిన అధికార ప్రతినిధివర్గంలో సభ్యునిగా డాక్టర్ చెలికాని చైనా అద్యక్షుడు మావోతో సహా ముఖ్యనాయకులందరినీ కలిసి చర్చలు జరిపారు.
రామారావుగారి జీవనసహచరి కమలమ్మగారు 1976 లో మరణించే ముందు ఒక సంవత్సరం పైగా అనారోగ్యంతో మంచంమీద కదలలేని స్థితిలో ఉండిపోయారు. ఆ సంవత్సర కాలమూ రామారావుగారు ఆమె దగ్గరే ఉండి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకున్నారు. "ఇంతమంది ఉండగా ఈ వయసులో మీకెందుకు శ్రమ?" అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబు గుండెను కదిలిస్తుంది. "జీవితమంతా రాజకీయాలలో మునిగిన నేను భర్తగా ఆవిడకు న్యాయం చేకూర్చలేకపోయాను. ఈ స్థితిలో ఆవిడకు సేవచేయ్యడం నా బాధ్యత!"అన్నారు. ఆర్ధిక సంబంధాలు బెడిసికొడితే భార్యాభర్తలే పరస్పరం విరోధులుగా మారుతున్న ఈ దౌర్భాగ్యపు వ్యవస్థలో డాక్టర్ రామారావుగారి జవాబు ఆయనలోని ఉదాత్తమైన జీవితాదర్శాన్ని తెలియచేస్తుంది.


ఇంతటి ఉన్నతమైన నైతికవిలువలు మూర్తీభవించిన మహామనీషి, మంచి కమ్యూనిస్టు డాక్టర్ చెలికాని రామారావుగారి ఆదర్శ జీవితం యువతకు మార్గదర్శకం కావాలి.

(1985అక్టోబరు 5 సంతాపసభ సందర్భంలొ ‘విశాలాంధ్ర’ దినపత్రిక ప్రచురించిన అదృష్టదీపక్ రచన ఇది.)
***************చేతల మనిషి చెలికాని రామారావు
నేడు జాతీయోద్యమ విలువలు వెనుక పట్టుపట్టినది. డబ్బు, అధికారం అనేవి రాజకీయ జీవితాన్ని కలుషితం చేస్తున్నవి. దేశం ఎదుర్కొన్న ఇట్టి క్లిష్ట పరిస్థితుల్లో డాక్టరు చెలికాని వెంకట్రామారావుగారి ఆదర్శ జీవితాన్ని స్మరించుకోటం ఎంతైనా అవసరం- అ మాటలు సుప్రసిద్ధ సామాజిక యోధ్యులు చండ్ర రాజేశ్వరరావు అన్నవి. 1992 చెలికాని వెంకట్రామారావు ఏడో సందర్భంగా రాజేశ్వరరావు ఇలా నివాళి సమర్పించారు. తన జీవితాన్ని దేశ ఔనత్యంకోసం, ప్రజాసేవకోసం, సంఘ సంస్కకరణకు, సామాజికి న్యాయానికి ధారపోసిన చెలికాని జీవితరేఖలు వీక్షిద్దాం.
1901 జులై 15న తిమ్మాపురంలోని వారి మాతామహులు రావుతిరుపతిరావు గృహంలో జన్మించారు. అయితే చెలికాలి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని కొండెవరం! చరిత్రలో ప్రసిద్ధి పొందిన కొండెవరం యుద్ధం/ కొండూరు యుద్ధం/ చందుర్తి యుద్ధం అక్కడే జరిగింది. ఫ్రెంచివారు ఓడిపోయి పిఠాపురం జమీందార్ల ప్రాధాన్యం పెరిగింది అప్పుడే. చెలికాని బాల్యంలో ఎన్నో మార్పుల్ని చూశారు. ఒకవైపు స్వాతంత్య్ర సమరం భీకరంగా సాగుతుంటే మరోవైపు పిఠాపురంరాజా బెంగాలునుంచి బ్రహ్మసమాజం కార్యకర్తల్ని ఆహ్వానించి బ్రహ్మ మందిరం నిర్మించారు. రామారావు పిఠాపురం పాఠశాలలోనే విద్య గడించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూచి నరసింహ పంతులు- ఆయన బ్రహ్మసమాజవాది. ఆ ప్రభావాలన్నీ రామారావుపై సహజంగానే పడ్డాయి. బ్రిటిషువారు రౌలట్‌ చట్టం ప్రవేశపెట్టారు. వారి ద్వంద్వనీతి, అధికార దుర్మదాంధత జాతీయవాదుల్ని ఆగ్రహానికి గురిచేశాయి. 1920 సంవత్సరం మార్చి నెలలో పరీక్షలు రాయవలసిన చెలికాని రామారావు, పరీక్షల్ని పక్కకునెట్టి దేశం గురించి ఆలోచించడం ప్రారంభించారు. పెద్దల సలహాతో ఆ ఏటి పరీక్షలు పూర్తిచేశారు .  
 
కానీ 1921 మార్చిలో రాయవలసిన ఎఫ్‌.ఎ. పరీక్షలు మాత్రం రాయలేకపోయారు. అంతేకాదు 1921 జనవరి 26 తెల్లవారుజామున ఇంట్లో వారందరికీ ఓ ఉత్తరం రాసిపెట్టి కాలినడకన కాకినాడ బయలుదేరారు. ఆ ఉత్తరానికి ఆయన 'గృహ పరిత్యాగ పత్రం' అని పేరుపెట్టారు. సహాయ నిరాకరణోద్యమంలో సర్వశక్తులూ ఒడ్డి మనస్ఫూర్తిగా పనిచేసేందుకు తనని ఆశీర్వదించమని, ప్రోత్సహించమని ఆ ఉత్తరంలో ఆయన రాశారు. తెల్లారిన తర్వాత బయలుదేరితే ఇంట్లోవారు పోనివ్వరని రాత్రికి రాత్రే బయలుదేరి వెళ్లిపోయారు! ఒకవైపు కూచి నరసింహం, మరోవైపు రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆదర్శాలను నిత్యం మననం చేసుకుంటూ ఆయన జాతీయోద్యమాన్ని ఆలింగనం చేసుకొన్నారు. గాంధీజీ బోధించిన సామాన్య జీవనం, త్యాగం, మానవసేవ ఆయన అలవరుచుకొన్నారు. హరిజనోద్ధరణోద్యమంలో పాలు పంచుకున్నారు.
చెలికాని రామారావు తొలిసారిగా 1922లో అరెస్టయ్యారు. రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు విప్లవకారుడు నీలకంఠ బ్రహ్మచారితో ఆయనకు తొలిసారి పరిచయం కలిగింది. ఆ పరిచయం ఆయన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. రష్యా విప్లవం, దాని ఫలితం, మార్క్సిజం మొదలైన విషయాలు బ్రహ్మచారి నుంచి తెలుసుకున్నారు. జైలునుంచి విడుదలయ్యాక కాకినాడ కాంగ్రెస్‌ సభలో పాల్గొన్నారు. ఆ సభల్లోనే ఆయనకి నైజాం ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు మాడపాటి హనుమంతరావు, మహదేవరావు వంటి వారితో పరిచయాలు కలిగాయి. 1924 నుంచి 26 వరకు జరిగిన పెదనందిపాడు పన్నుల నిరాకరణ, పల్నాటి పుల్లరి ఉద్యమాలు కార్యకర్తల్లో విభేదాలకు కారణమయ్యాయి. ఆ సమయంలోనే చెలికాని పూర్తిచేయకుండా ఆపిన తన చదువు పూర్తి చేయాలని, పేద ప్రజలకు సేవ చేయాలని సంకల్పించారు. వైద్య విద్య కోసం ఆయన హైదరాబాద్‌ చేరుకున్నారు.

1926-30 మధ్యకాలంలో ఆయన ఆనాటి వైద్యవిద్య అభ్యసించారు. చదువు పూర్తికాకుండానే బులుసు సాంబమూర్తి చెలికానిని కాకినాడ వచ్చి ఉప్పు సత్యాగ్రాహ ఉద్యమంలో తన ప్రధాన సేనానిగా పనిచేయమని ఆహ్వానించారు. దాన్ని తన కర్తవ్యంగా భావించి కాకినాడ చేరుకున్నారు. పోలీసులు అరాచకం సృష్టించారు. తీవ్రంగా హింసించారు. ప్రభుత్వం 144వ సెక్షన్‌ విధించింది. సేవాదళంలో చేరి రాజమండ్రి, కోరాపుట్‌, బళ్లారి తదితర ప్రాంతాల్లో పనిచేశారు. హరిజనోద్యంలోనూ చేరి విస్తృత ప్రచారం చేశారు. చెలికాని అరెస్టయ్యారు. ప్రభుత్వం ఆయన్ని బళ్లారి జైలులో ఉంచింది. ఆయన క్షయ వ్యాధికి గురయ్యారు. శానిటోరియంలో చేరారు. ఆరోగ్యం కుదుటపడ్డాక తిరిగి హైదరాబాద్‌ వెళ్లి వైద్యపరీక్షలు రాశారు. పరీక్షల తర్వాత మళ్లీ స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించారు. మళ్లీ అరెస్టయ్యారు. ఆ పర్యాయం పద్దెనిమిది నెలలు ఆయన కోరాపుట్‌, కడలూరు జైళ్లలో శిక్ష అనుభవించారు. మళ్లీ ఆరోగ్యం క్షీణించింది. మరోవైపు వివిధ ప్రాంతాల నాయకులతో పరిచయాలు కలిగాయి. ఆయన సోషలిస్టు భావాలవైపు మొగ్గారు. సోషలిస్టులు కాంగ్రెస్‌లో ఒక బలమైన వర్గంగా ఏర్పడ్డారు. వాళ్లంత సుభాష్‌ చంద్రబోస్‌ ఆశయాలను ప్రచారం చేశారు. అందుకే సుభాష్‌ చంద్రబోస్‌ ఆంధ్ర దేశం పర్యటించినప్పుడు కాంగ్రెస్‌ నిర్ణయాన్ని ధిక్కరించి చెలికాని నేతాజీ సభల్ని తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా నిర్వహించారు. క్షయ వ్యాధికి గురైన చెలికాని తన వైద్యవిద్యలో భాగంగా క్షయవ్యాధిపై డిప్లొమా చేయడానికి మైసూరు వెళ్లారు. అక్కడే ఆయన వైద్య విద్యార్థిని కమలమ్మ రామస్వామి నాయుడిని చూశారు. మనసులు కలిశాయి. పెద్దల ఆశీస్సులతో రిజిష్టరు వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ నాయకులు బర్మా, మలయా, సింగపూర్‌ ప్రాంతాలలోని ఆంధ్రుల సహాయం పొందేవారు. తరచూ వెళ్లేవారు. చెలికాని వైద్యుడు కాబట్టి రంగూన్‌ ఆంధ్రులకు ఆయన వైద్య సేవలు చేస్తే వారి సహాయం అందుతుందని కాంగ్రెస్‌ భావించడంతో చెలికాని రంగూన్‌ వెళ్లారు. కమలమ్మ రాజోలు, రామచంద్రాపురంలలో వైద్యశాఖాధికారిణిగా నియమితులయ్యారు. కొన్నేళ్లు అక్కడ పనిచేశాక చెలికాని తిరిగి తూర్పుగోదావరి జిల్లా చేరుకున్నారు. అయితే బర్మాలో జరిగిన అనేక ఉద్యమాలను స్వయంగా చూసిన ఆయన కాంగ్రెస్‌ మితవాద వైఖరి ద్వారా స్వరాజ్యం సాధించడం అసాధ్యమని విశ్వసించారు. 1939-1946 మధ్యకాలంలో కమ్యూనిస్టులు రాజకీయ పాఠశాలలు నిర్వర్తించారు. చెలికాని వాటిల్లో పాల్గొని వందలాది మందిని ఉత్తేజితుల్ని చేశారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా ఆయన ప్రజలతో మమేకం అయ్యారు. పార్టీ సిద్ధాంతాల్ని అనుసరించారు. అప్పట్లోనే అంటే 1944లోనే తయన తనకు ఒక కుమారుడు కలగగానే కుటుంబనియంత్రణ చికిత్స చేసుకున్నారు. (అప్పట్లో సంతాన నిరోధ చికిత్సలనేవారు) 1952లో ప్రథమ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుంచి ఆధిక్యంతో గెలుపొందారు. చిత్రమేమిటంటే ప్రజాపార్టీ నాయకుడు బులుసు సాంబమూర్తినీ, కాంగ్రెస్‌ అభ్యర్థి మొసలికంటి తిరుమలరావులిద్దర్నీ ఓడించి చెలికాని గెలిచారు. ఎన్నికల్లో పోటీచేసిన సమయంలో ఆయన అనారోగ్యంతో మద్రాసు తాంబరం ఆస్పత్రిలో ఉన్నారు. ఒక్కరినీ ఓటు అడగలేదు. అయినా గెలిచారు! ఆ తర్వాత పుచ్చలపల్లి, చంద్రరాజేశ్వరరావు వంటి నాయకులతో సన్నిహితంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. భారత పార్లమెంటు ప్రతినిధిగా ఆయన చైనా సందర్శించారు. చైనా ఎంతో అభిమానమున్నా 1962లో చైనా భారతదేశంపై యుద్ధం చేయడాన్ని గర్హించారు. ఆయన భూస్వామ్య వర్గానికి చెందినా మానవతా వాదిగా, దీనజనబంధువుగా, కార్యదీక్షాదక్షుడిగా పేరుపొందారు. 1985 సెప్టెంబరు ఇరవై అయిదున ఆయన తుదిశ్వాస విడిచారు.
- చీకోలు సుందరయ్య

 (ఈనాడు - సాహితీ సంపద -మహామహులు నుండి...)
 

                             .............................


   
డాక్టర్. చెలికాని రామారావుగారి వ్యక్తిగతం.......

డాక్టర్. చెలికాని రామారావుగారు అనారోగ్యం నుండి కోలుకోవడం, వైద్య పరీక్ష పూర్తి చేయడం, జైలు జీవితం గడపటం పూర్తి అయిన తర్వాత, ఆయన క్షయ వ్యాధిపై ప్రత్యేక డిప్లొమా కోర్సు చేయడానికి 1934 లో మైసూర్ వేళ్ళడం జరిగింది. అక్కడ యాదృచ్చికంగా వైద్య విద్యార్ధినిగా ఉన్న కమలమ్మ రామస్వామి నాయుడు గారిని కలవడం జరిగింది. ఈమె మైసూర్ సంస్థానంలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందినవారు. వీరి తండ్రి రామస్వామి నాయుడుగారు కందుకూరి వీరేశలింగంగారి అనుచరుడు. అందుచేత తన కుమార్తెలను వీరేశలింగంగారి శరణాలయంలో ఉంచి, కందుకూరి వీరేశలింగం-రాజ్యలక్ష్మిగార్ల సంరక్షరణలో పెంచి పెద్ద చేశారు.వారు బ్రహ్మసమాజకులు.
డాక్టర్. చెలికాని రామారావుగారు జాతీయ ఉద్యమంలో చేరకముందే బ్రహ్మసమాజం వైపు ఆకర్షింపబడ్డారు. ఇద్దరిదీ ఒకేవృత్తి..ఒకే రకమైన భావాలు..ఒకరు ఆధునిక ఆంధ్ర యుగకర్త వీరేశలింగం గారి శిష్యులయితే, మరొకరు బ్రహ్మర్షి రఘుపతి వెంకటరట్నం నాయుడిగారి శిష్యులు. అందువలన ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి, వివాహం చేసుకోవాలన్న నిర్ణయానికి రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
౧౯౩౪ ఏప్రియల్ లో ఏర్పడిన ఈ సంబంధం డిశంబరు నాటికి రిజిష్టరు వివాహానికి దారితీసినా, కమలమ్మగారి వైద్య విద్య పూర్తికానందున సాంసారిక జీవితం మరి 3,4 సంవత్సరాలకు గానీ కుదుటపడలేదు.
ఈలోపున డాక్టర్. చెలికాని రామారావుగారు హరిజన సేవాకార్యక్రమాలు, కాంగ్రెస్ సోషలిస్టు భావాల ప్రచారం కాకినాడ, పిఠాపురం మరియు కొండెవరం ప్రాంతాలలో విరామం లేకుండా చేశారు. అయితే ఏకార్యక్రమానికయినా కాంగ్రెస్ పార్టీ ధన సహాయం ఉండేది. కానీ కాంగ్రెస్ సోషలిస్టులకు ఆ సదుపాయాలు అంతంతమాత్రం.
అందువలన ఈకార్యక్రమాలకు ధనం సమకూర్చుకోవడం ఆయనకు ఒక సమస్య అయింది. వారి కుటుంబ సభ్యులు కొంతమేరకు సహాయపడ్డా,ఉచిత వైద్య సేవలకు, హరిజన సేవాకార్యక్రమాలకు హెచ్చు మొత్తంలో నిధులు అవసరమయ్యేవి.
వైద్య సేవల ద్వారా నిధులు సమకూర్చుకోవాలన్న ఉద్దేశంతొ, 1937 లో ఆయన బర్మా వెళ్ళి రంగూన్ లో వైద్య వృత్తి ప్రారంభించారు. అక్కడి తన సంపాదననుంచి తూర్పు గోదావరి జిల్లాలోని హరిజన సేవా కేంద్రాలకు ఆర్ధిక సహాయం అందించేవారు. ఇదే సమయంలో అక్కడి ఆంధ్రుల కష్టాలు, అక్కడి కార్మికవర్గ స్థితిగతులు అవగాహన చేసుకున్నారు.

ఇంతలో కమలమ్మ గారు వైద్య పట్టా అందుకున్నారు. అప్పుడు తూర్పు గోదావరి జిల్లా బోర్డు అధ్యక్షులయిన మల్లిపూడి పళ్ళంరాజుగారు కమలమ్మగారిని జిల్లాలోని లోకల్ బోర్డ్ ఆసుపత్రిలో సేవలందించాల్సిందిగా సూచించారు. ఆమె ఉద్యోగం చేస్తుంటే, ఆయన రాజకీయ కార్యక్రమాలు చూసుకోవటం సులువని, ఆర్ధికంగా యితరులపై ఆధారపడనవసరం ఉండదని చెప్పి డాక్టర్. చెలికాని రామారావుగారిని ఒప్పించి, కమలమ్మగారిని రాజోలు తాలూకా వైద్య అధికారిణిగా 1939 లో నియమించారు.
అక్కడనుండి 1940 లో రామచంద్రపురం హాస్పటల్ కి బదిలీ అయింది. నాటినుండి డాక్టర్. చెలికాని రామారావుగారి రాజకీయ కార్యక్రమాలకు కొండెవరం, పిఠాపురం, కాకినాడల బదులుగా రామచంద్రపురం కేంద్రస్థానమయింది.

(డాక్టర్ బి.వి.వి.బాలకృష్ణ రచన - డాక్టర్. చెలికాని రామారావు జీవితం-ఒక రాజకీయ పరిశీలన-నుండి)

కుటుంబ నియంత్రణ - డాక్టర్ చెలికాని...

......1944 లో చెలికాని దంపతులకు ఒక కుమారుడు జన్మించారు. వారి నియమం ప్రకారం ఇద్దరు పిల్లలు మించి కలగగూడదనుకున్నారు. కాని ఒక సంతానికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజుల్లో సంతాన నిరోధక ఆపరేషన్లు చేయగలిగే వ్యక్తి, అందునా ఉచితంగా చేసే వైద్యుడు రామారావుగారే. 1944 లో కమ్యూనిస్టు కన్వెన్షన్ విజయవాడలో జరిగినపుడు, పూర్తికాలం పనిచేసే పార్టీ కార్యకర్తలు ఇద్దరి కంటె ఎక్కువ సంతానం కలగకుండా కుటుంబ నియంత్రణ పాటించాలనే సూచనను తీర్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఆపరేషన్లు చేసేందుకు నియమించిన ముగ్గురు డాక్టర్లలో చెలికాని ఒకరు. మిగతా ఇద్దరూ ఏలూరుకి చెందిన తిలక్, నిడదవోలుకు చెందిన బి.వి.ఎల్.ఎన్.నరసింహరాజు. ఈ తీర్మానానికి ముందే డాక్టర్ చెలికాని కుటుంబ నియంత్రణ పాటించారనటానికి నిదర్శనం, ఆయనకు వివాహమైన పది సంవత్సరాలకు కుమారుడు జన్మించడం.
డాక్టర్ స్టాలిన్, M.S
ఆయన తమ కుమారునికి ‘స్టాలిన్’ అని పేరుపెట్టి, రెండవప్రపంచ యుద్ధంలో స్టాలిన్ పాత్రపై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు.

***************

పార్లమెంట్ సభ్యులుగా.. డాక్టర్ చెలికాని ..
1952 లో ప్రధమ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు నియోజక వర్గం నుండి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా డాక్టర్ చెలికాని రామారావు గారు, ప్రజాపార్టీ అభ్యర్ధి బులుసు సాంబమూర్తి, కాంగ్రెస్ అభ్యర్ధి మొసలికంటి తిరుమలరావు గార్లపై విజయం సాధించారు. అనారోగ్యంతో తాంబరం ఆసుపత్రిలో ఉండే, ఈఎన్నికలో పాల్గొని విజయం సాధించడం విశేషం.

....ఈయన తన పదవీకాలంలో లోక్ సభలో పలు విషయాలపై జరిగిన చర్చల్లో చురుకుగా పాల్గొని, ఆంధ్ర రాష్ట్ర్ర సమస్యలనే గాక జాతీయ సమస్యలపై కూడా చర్చించి, గోదావరి జిల్లాకు వన్నె తెచ్చారు.
శ్రామికవర్గ ప్రతినిధిగా తన వాక్పటిమతో అప్పటి ప్రధాని పండిట్ నెహ్రూ మన్ననలు అందుకున్నారు.
ఆయన తన పార్టీ సిద్ధాంతాలకే పరిమితంకాకుండా, శ్రామికవర్గ సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు.
అంతేకాక ప్రభుత్వం నడిపే అనాధ ఆశ్రమాలు, నీటి పారుదల పధకాలు, పరిశ్రమల స్థాపన, వ్యవసాయ కార్మికులకు భూముల పంపకం, చిన్న ఓడరేవుల అభివృద్ధి, వంతెనల నిర్మాణం, కొత్త రైల్వె లైన్ల అభివృద్ధి వంటి పెక్కు విషయాలపై చర్చించారు.

****************
"young people who were under Gandhi's influence during the civil disobedience movement and went to jails as Gandhians were influenced by the revolutionaries in jails and came out ardent supporters of socialism.
consider, for instance what happened in Andhra.
Dr. Chelikani Ramarao arrested during the civil disobedience movement was sent to Rajahmundry central jail. He learnt the basic principals of socialism in jail, and joined the Socialist party.....''
-'History of the Communist movement in India'
By:
Harkishan Singh Surjeet
Communist party of India (Marxist)            .............................................

Chelikani Venkata Rama Rao

From Wikipedia, the free encyclopedia

Chelikani Venkata Rama Rao
Member of Parliament
Constituency Kakinada constituency
Personal details
Born 15 July 1901
Kondevaram, East Godavari district
Died 25 September 1985
Ramachandrapuram
Political party Communist Party of India
Spouse(s) Dr. Ch. Kamalamma
Children 1 son Dr.Stalin
Religion Hindu
Website [1]
Dr. Chelikani Venkata Rama Rao (Telugu: చెలికాని వెంకట రామారావు) (b: 15 July 1901 - d: 25 September 1985) was a Communist leader and Member of Indian Parliament.
He is son of Shri Narayana Swamy and born at Kondevaram, East Godavari district on 15 July 1901. He was educated at R. Ch. High School, Pithapuram and P. R. College, Kakinada. He was graduated from Osmania Medical College, Hyderabad. He married Dr. Ch. Kamalamma in 1934. They had one son, Dr. Stalin
He was elected to the 1st Lok Sabha from Kakinada (Lok Sabha constituency) in 1952 as a member of Communist Party of India.
He died on 25 September 1985 at Ramachandrapuram.

External links

http://chelikaniramarao.blogspot.in/


         ....................................................

Web Site Hit CountersTHE OSMANIA MEDICAL COLLEGE, HYDERABAD 1St.YEAR CLASS, 1925-26, GROUND..4Th. Ch.V. RAMARAO
P.R. COLLEGE, COCANADA - 1919- 1St.Row Sitting 7- RAGHUPATI VENKATA RATNAM NAIDU, 3rd. Row 8. Ch.V. RAMARAO

Dewan Bahdur RAGHUPATI VENKATA RATNAM NAIDU, M.A;L.T

Chelikani Ramarao( 1919)చెలికాని రామారావు గారి చేతి వ్రాత
PITTAPUR RAJAH'S COLLEGE, COCANADA- INTERMEDIATE, B.SECTION 1939-41

OSMANIA MEDICAL COLLEGE, HYDERABAD, Second year class 1926-27, 4th.Row 3. Ch.V. RAMARAO


Osmania Medical College, Hyderabad (16March 1928) Ground: 1St. Ch.V.RamaraoOSMANIA MEDICAL COLLEGE, HYDERABAD, 13OCTOBER 1928, Ground, 1St.Row 3. Ch.V. RAMARAO
OSMANIA MEDICAL COLLEGE HOSTEL-1929, Standing 3rd. Ch.V. RAMARAO
వీక్షణం
(డాక్టర్ చెలికాని రామారావు స్మారకోపన్యాసాల సంకలనం)

ప్రచురణ:
డాక్టర్ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ
రామచంద్రపురం

September, 2004


సందేశము
శ్రీ చెలికాని రామారావు దేశభక్తిపరుడు, త్యాగశీలి. పార్లమెంట్ మెంబర్ గా సేవలందించారు. తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ చైతన్యంతో ఎం.పి.గా నెగ్గటం ప్రజల విశ్వాసంతోనే. ఆనాడే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో ప్రజామన్నన పొందారు. మా అందరికీ గురుతుల్యులు.
ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధునిగా, నిస్వార్ధ ప్రజాసేవకులుగా మనగల్గిన ఆయన స్మారక భవనానికి శంఖుస్థాపనలో నేను పాలుపంచుకోగలగడం నా అదృష్టం.
ప్రముఖులతో ప్రతి ఏటా స్మారకోపన్యాసాలు ఇప్పించటం చాలా సంతోషం. ఈ కృషిని యిలాగే సాగించాలని ఆకాంక్షింస్తూ..
శుభాభినందనలతో..

భవదీయుడు
వావిలాల గోపాలకృష్ణయ్య
గుంటూరు

( శ్రీ వావిలాల చనిపోవడానికి కొద్దిరోజుల ముందు ఇచ్చిన సందేశం) ---------
వీక్షణం’
(డాక్టర్ చెలికాని రామారావు స్మారకోపన్యాసాల సంకలనం)
విషయసూచిక
1.ముందుమాట
2.అభ్యుదయ కవిత్వంలో పరిణామాలు-ఆవంత్స సోమసుందర్
3.భారతీయ సంస్కృతి-రాంభట్ల కృష్ణమూర్తి
4.మార్క్సిజం,భారత దేశం-ఆచార్య కె.శేషాద్రి
5.తెలుగుపదజాలం,ప్రపంచభాషల ప్రభావం-
ఆచార్య తూమాటి దొణప్ప
6.మార్క్స్ వాదం,బారతదేశంలో గ్రామ అధ్యనం-కె.వెంకటేశ్వర్లు
7.రాజకీయాలు,నైతిక విలువలు-చెన్నమనేని రాజేశ్వరరావు
8.భారతదేశంలో మానవ వనరుల సంపద,మహిళల పాత్ర-డా.పి. చిరంజీవినీ కుమారి
9.సందేశం-డా.రాజ్ బహుదూర్ గౌర్
10.భారత జాతీయోద్యమంలో విలక్షణమైనది,హైదరాబాద్ విమోచనోద్యమం-ఆచార్య ఎస్వీ సత్యనారాయణ
11.నెహ్రూవియన్ విజన్-ఆచార్య వకుళాభరణం రామకృష్ణ
12.భారతీయ తాత్విక చింతనపై జాతీయోద్యమ ప్రభావం-పరకాల పట్టాభి రామారావు
13.ఆంధ్రుల సంస్కృతి-ఆర్వియార్
14.తెలుగునాట సాంస్కృతిక చైతన్యం, పెడధోరణులు-ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి
15.అవినీతి,ఎన్నికల సంస్కరణలు-డి.వి.వి.యస్.వర్మ
16.పత్రికలు,నైతిక విలువలు-డా.పొత్తూరి వెంకటేశ్వర్రావు
17.నాపాలిట దేవుడు-రావు కృష్ణారావు

వీక్షణం - ముందుమాట
“తన కార్యము పరిత్యజించియు పరార్ధ ప్రాపకుల్ సజ్జనుల్” అనునది మహాకవి భర్తృహరికృత సుభాషితానికి ఏనుగు లక్ష్మణ కవి చేసిన ఆంధ్రానువాదము. ఈ సుబాషితము డాక్టర్ చెలికాని రామారావు గారికి పూర్తిగా అన్వయిస్తుంది. రామారావు గారి జీవితం(1901- 1985) 20 శతాబ్దపు భారతదేశ అత్యుత్తమ సంఘటనలన్నింటితో ముడిపడి ఉంది. బ్రహ్మసమాజ ఉద్యమం, హరిజనసేవ, స్త్రీజనోద్ధరణ, స్వాతంత్ర్య పోరాటం, కమ్యూనిస్టు ఉద్యమం, జైలు జీవితం, పార్లమెంట్ సభ్యత్వం, వైద్యసేవ అన్నీ ఆయన జీవిత చరిత్రలో భాగమే! అన్నింటికన్నా మానవీయత, నిజాయితీ, నిబద్ధత, వినమ్రత,స్పష్టత ఆయన విశిష్ట లక్షణాలు.
అటువంటి మహనీయుడు 25-9-1985 న మరణించారు. ఆయన్ను అభిమానించే స్థానిక పెద్దలంతా కలిసి ఆయన స్మారకార్ధం ఒక భవనం నిర్మించాలని, ఆ భవనంలో సామాజికావగాహనకు తోడ్పడేలా ప్రతి సంవత్సరం ప్రముఖులచే ఉపన్యాసాలిప్పించాలని, వివిధ జాతీయ దినోత్సవాలకు, ఇతర సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఆ భవనాన్నుపయోగించాలని సంకల్పించి కృషి ప్రారంభించారు. ఎందరో మహానుభావులు! పలువిధాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సాయపడ్డారు. 25-9-1988 న శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. 25-9-1990 న కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ నీలం రాజశేఖరరెడ్డి భవనాన్ని ప్రారంభించారు.
1986 నుండి క్రమం తప్పకుండా స్మారకోపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ కార్యకలాపాలు జరుగుతున్నాయి. శ్రీ బి.వి.వి. బాలకృష్ణ ఎం.ఫిల్. పట్టాకోసం ఆంధ్రాయూనివర్సిటికి సమర్పించిన (డా.చెలికాని రామారావు గారి జీవితం) సిద్ధాంత వ్యాసాన్ని తెలుగులోకి సంక్షిప్తానువాదం ఆయనే చేయగా ‘విశాలాంధ్ర’ పబ్లిషింగ్ హవుస్ వారు ప్రచురించారు. దీని వెనుక కమిటి కృషి ఎంతో ఉంది. ప్రతి సంవత్సరం రామారావు గారి అభిమానులు, కుటుంబ సభ్యులు, పేద, ప్రతిభావంతులైన విద్యార్ధులకు స్కాలర్షిప్పులువర్ధంతి రోజున కమిటీద్వారా అందచేస్తున్నారు. భవనం ప్రారంభమయిన దగ్గరనుండి వివిధ కార్మిక సంఘాలకు, ప్రజాసంఘాలకు, వారి సమావేశాలు జరుపుకోవడానికి చాలా ఉపయోగకరంగాఉంది. అనేక సమావేశాలీ భవనంలోనే జరిగాయి. అన్ని సౌకర్యాలు లేకున్నా అనేక బీద కుటుంబాలవారీ భవనంలో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కీ.శే. శ్రీ పుత్సల సత్యనారాయణగారు స్థాపించిన ఆర్.కె. ఐడియాలాజికల్ సొసైటీ వారు నిర్వహించే సభలకు, కార్యకలాపాలకూ ఈ భవనమే కేంద్రంగా ఉంది. రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం,నెహ్రూ జయంతి మొదలైన అనేక జాతీయ పండగలను ఈ భవనంలొ పలుమార్లు ఘనంగా రామారావుగారి స్మారక కమిటీ నిర్వహించింది. బీద,మధ్యతరగతి వారి పెళ్ళిళ్ళకు అనువుగా ఉండేలా వంటగది,మరో రెండు గదులు 2004 లో నిర్మించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రచురిస్తున్న‘ఆంధ్రుల సమగ్ర చరిత్ర, సంస్కృతి’ మొదటి సంపుటి (తెలుగు) ప్రచురణకు కమిటి ఆర్ధిక సహకారమందించింది. వారందుకు పుస్తకంలో కృతజ్ఞతలుతెలియజేశారు కూడా! అలాగే గుంటూరు లెఫ్టిస్ట్ స్టడీ సర్కిల్ వారు స్మారక కమిటీ సహకారంతో ప్రతి సంవత్సరం చెలికాని రామారావు గారి స్మారకార్ధం ఒక కరపత్రం ప్రచురించాలని నిర్ణయించారు. వారికి కూడా కమిటీ తరఫున కృతజ్ఞతలు. క్లుప్తంగా చెప్పాలంటే రామారావుగారి ఆశయాలను, విలువలను ఏదోమేర నిలిపి ఉంచడానికి స్మారక కమిటీ తన శక్తికి మించే పనిచేసింది. భవిష్యత్తులో కూడా చేస్తుంది.
ఇప్పటివరకూ జరిగిన స్మారకోపన్యాసాలన్నింటిని పుస్తకంగా ప్రచురించాలనే ప్రయత్న ఫలితమే ఈ పుస్తకం (వీక్షణం). కొందరు ప్రముఖుల ఉపన్యాసాలను సకాలంలో సేకరించలేకపోయాం. వాటిని తర్వాతైనా ప్రచురించే ప్రయత్నం చేస్తాం. ఇందులో ప్రచురించినవన్నీ స్మారకోపన్యాసాలు కావు. వివిధ జాతీయ దినోత్సవాల సందర్భంగా స్మారక కమిటీ ఏర్పాటు చేసిన సభలలో ఇచ్చిన ఉపన్యాసాలు కొన్ని ఉన్నాయి. ఒక వ్యాసం నివాళిగా రచయిత వ్రాసింది. ఉపన్యాసం కాదు. ఇక్కడ మేము నొక్కి చెప్పాలనుకుంటున్నది - ఈ ఉపన్యాసకులందరూ వివిధ రంగాలలో లబ్దప్రతిష్టులు. ఈ ఉపన్యాసాలు వారి ప్రతిభకు కొలబద్దలుకావు. గ్రామీణ వాతావరణం కావడంచేత సభికుల్లో అత్యధికులు శ్రామిక వర్గానికి చెందినవారవడం చేత సరళమైన విషయాలను సుబోధకంగా మాట్లాడమని కమిటీ ఈ ఉపన్యాసకులను కోరింది.
పాఠకులు తమ విలువైన అభిప్రాయాలను కమీటీకి తెలియజేస్తే సంతోషిస్తాం! ఈ పుస్తక ప్రచురణలో ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ అనేకమంది సాయపడ్డారు. వారందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకించి వ్యాసాల సేకరణతో ప్రచురణను ప్రోత్సహించి ముందుకు నడిపించిన డాక్టర్ జె. దుర్గాప్రసాద్ గారికి, రాతప్రతులనందించడం ఆలస్యం చేసినా సకాలంలో పుస్తకాన్ని అందంగా ముద్రించి ఇచ్చిన రాంషా-శిరీష పబ్లికేషన్స్(సామర్లకోట) అధినేత శ్రీ పూషాగారికి కృతజ్ఞతలు. ఉపన్యాసకుల ఫొటోల నిచ్చి సాయపడిన విశాలాంధ్ర వారికి కృతజ్ఞతలు.
గత ౧౮ సంవత్సరాలుగా డాక్టర్ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ తన కార్యకలాపాలను నిరంతరాయంగా నిర్వహించడానికి అనేకమంది అనేక విధాల సాయపడ్డారు. వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ..

భవదీయుడు,
చెలికాని శేషారావు,
కోశాధికారి,
డాక్టర్ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ
కాకినాడ,10-9-2004
..........................................................

స్మారకోపన్యాసాల సందర్భంగా
ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు క్లుప్తంగా......

‘వీక్షణం’ సౌజన్యంతో..
శ్రీ ఆవంత్స సోమసుందర్
-చెలికాని రామారావుగారితో నాది ప్రత్యేకమైన అనుబంధం. నా చిన్నతనం నుండే ఆయన గురించి వింటూ,చర్చిస్తూ వచ్చాను. ఆయన స్వగ్రామం మా పిఠాపురానికి అతి దగ్గరగా ఉన్న కొండెవరం.ప్రాధమిక, ప్రాధమికోన్నత విద్యలోచక్కగా రాణించి, ఉన్నత విద్యకై ఇంగ్లండు పంపుతాననే వాగ్దానం పిఠాపురం రాజావారినుండి పొందికూడా దేశంకోసం చదువు, ఇల్లు విడిచి వెళ్ళిన ఆయన్ను గౌతమబుద్ధుని మహాభినిష్క్రమణతో పోల్చుకొని మేము కధలు కధలుగా చెప్పుకునేవారము. చిన్నతనంనుండి వారిపేరు నాకు ఎంతో ఇన్సిప్రేషన్ ఇస్తున్నా వారిని సన్నిహితంగా మాత్రం తూ.గో.జిల్లా పార్టీ మహాసభ రాజోలు తాలూకా జగ్గన్నపేట గ్రామంలో జరిగినపుడు మాత్రమే! ఎందుకో వారికి కూడా నామీద వాత్సల్యం కలిగింది.
ఆయన గురించి నాకు తెలిసినవి, నేను విన్నవి పూర్తిగా చెప్పాలంటే అనేక రోజులు పడుతుంది. రామారావు గారి నాయకత్వంలో జరిగిన వాలంటీర్ల శిక్షణాశిబిరంలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటివారు తర్ఫీదు పొందారు. ఎల్లారెడ్డిగారు ఆనాటి విశేషాలు నాతో చెబుతూ రామారావుగారి గురించి చాలా గొప్పగా చెప్పారు. కడలూరు జైలులో రామారావు గారు చూపిన సాహసం,సేవానిరతి, గురుత్వం ఆయనతోబాటు జైలులో ఉన్న అనేకమంది కధలు కధలుగా చెప్పగా నేను విన్నాను. కాల్పులు జరుగుతున్నా వెరవకుండా గాయపడినవారికి వైద్య సేవలందించడానికి ఆయన చూపిన సాహసం మరువలేనిది. ఆయనా జైలులో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. వైద్యునిగా, వివిధ విషయాలు బోధించే గురువుగా, అందరికీ ధైర్యం చెప్పి అక్కున చేర్చుకునే ఆత్మీయునిగా, స్నేహితునిగా, తన రేషను కూడా తోటి ఖైదీలకిచ్చిన త్యాగశీలిగా విశ్వరూపంలో సాక్షాత్కరింపజేశారు అనేకమంది ఆనాటి సహఖైదీలు. ఆయన గురించి ఎన్నో విన్నాను! ఎన్నని చెప్పను!
పార్లమెంటేరియన్ గా నెహ్రూ వంటివారి మెప్పును పొందినవారాయన. వైద్యునిగా రంగా వంటివారికి స్వస్థత చేకూర్చటమేకాక కుటుంబనియంత్రణ శస్త్ర చికిత్సలు చేయడంలో రికార్డు స్థాపించారు. క్షయ వ్యాధి నిర్ధారణలోనూ, చికిత్సలోనూ ప్రత్యేక శిక్షణ పొందారాయన. అందులో నిపుణునిగా రాణించారు. తను ఆచరించి ఇతరులను ప్రోత్సహించిన గొప్ప సంస్కర్త. జీవితాంతం శాస్త్రీయ దృక్పధానికే కట్టుబడి ఉండి నాస్తికునిగానే తనువు చాలించారు. తన స్వంత ఖర్చులో ఎంత పొదుపరో ఇతరులకు పెట్టడంలో అంత దూబరా చేసేవారు. ఒక గృహస్థుగా వేలమందికి ఆతిధ్యమిచ్చారు. అనేకమంది విప్లవకారుల కుటుంబాలనుతన ఇంట్లో ఉంచుకుని వారి పురుళ్ళూ,వైద్యాలు చేశారు.
సదా ఆయన మాబోటి వాళ్ళకు ఉద్రేకోత్సాహాన్నిస్తుండేవారు. ఆ మహనీయుని సంస్మరణార్ధం ప్రతి సంవత్సరం మనం సమావేశమై స్మరించుకోవడం కన్న చరితార్దత మరోటి ఉండదు. ప్రధమ వర్ధంతి సభలో నన్ను చెలికాని రామారావుగారి స్మారకోపన్యాసం చేయమని కోరడం నాకు గొప్ప సన్మానంగా భావిస్తున్నాను.

-ఆవంత్స సోమసుందర్
25-9-1986

ఆరున్నర దశాబ్దాలుగా సాహితీ వ్యాసంగం చేస్తున్నశ్రీ సోమసుందర్ గారునిత్యయవ్వనుడు, నిత్యోత్సాహి. తెలుగు సాహిత్యక్షేత్రంలో కురువృద్దుడు. వయసు 84 వసంతాలు దాటినప్పటికీ ఇప్పటికీ కవిత్వాన్ని తన ఉఛ్వాస నిశ్వాసాలుగావెలువరిస్తున్న గొప్ప కవి, విమర్శకుడు శ్రీ సోమసుందర్ గారు,
కవిగా, కధకుడిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా భిన్న రూపాలతోగత 66 సంత్సరాలుగా సాహితీ సేవ చేయుచున్నారు.

...............................................................................................................


డాక్టర్ చెలికాని రామారావు గారు ఆదర్శ పురుషులు. ఆయనతో రాజమండ్రి జైలులో ఒక బ్లాక్ లోవుండవలసిన అదృష్టం నాకు ఏర్పడ్డందుకు నేనెంతో భాగ్యశాలిని. ఆయన నిదానము, నిస్వార్ధము, సహనము, నన్నెంతో ముగ్ధుడ్ని చేసినవి. మాకు జరిగే రాజకీయ పాఠాలు, చర్చలు మొదలగు సమయాలలో ఆయన తన సాదారణ నైజిక శైలిలో ఎదుటివాని వాదానికి ప్రతివాదము చేయటం నిజమైన మార్క్సిస్టు మేధావి గుణాన్ని చూపేవి. ఇది కాక జైలు లోని కామ్రేడ్ల కందరికి వైద్యుడుగా, స్నేహితుడుగా, సలహాదారుడుగా ఎంతో గౌరవాన్ని పొందిన మహామనీషి. ఆయనతో నేను గడిపిన జైలు జీవనం నాజీవితంలో ఒక ముఖ్యమైనమరుపురాని అధ్యాయం. అలాంటి డాక్టర్ చెలికాని రామారావు గారి వర్ధంతిలో నన్ను ఉపన్యసించమని కోరినందుకు వర్ధంతికి సంబంధించిన వారందరికి, వారి కుమారుడు డాక్టర్ స్టాలిన్ గారికి నా కృతజ్ఞతాభివందనా లర్పించటం చంద్రునికి నూలుపోగు....
-కె.శేషాద్రి
25-9-1992
........................................................................................................

కా.వెంకటేశ్వర్లు
కీర్తిశేషులు డాక్టర్ చెలికాని రామారావుగారు సుప్రసిద్ధ దేశభక్తులు. అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమనాయకులు. సంఘసంస్కరణాభిలాషి. ఆదర్శ ప్రజా ప్రతినిధి. రామారావుగారి రాజకీయ కార్యకలాపాలకు వాటి ఒరవడికి కలనేతగా కలిసిపోయిన స్థానిక రాష్ట్ర జాతీయ రాజకీయ రంగం వేదిక. మచ్చలేని, మర్మం ఎరుగని రామారావుగారి వ్యక్తిత్వం ప్రజాహితం సమాజ శ్రేయస్సు కొరకు జరిగిన బృహత్తర కృషిలో రామారావుగారునిర్వహించిన గణనీయమైన పాత్ర వారు ప్రదర్శించిన నియమ నిబద్ధత, పోరాట పటిమ మనకు దక్కిన వారసత్వపు సిరిసంపదలు. మనం ఆ సంపదను చేజార విడిచి మన కళ్ళను మనమే పొడుచుకొని ఆంధ్రదేశపు రాజకీయ గాడాంధకారంలో గుడ్డివాళ్ళ వలె నడుస్తున్నాము. మనం అంటె ఆంధ్రదేశంలోని సకల వామపక్షాలు వాటి అనుబంధ సంస్థలు సానుభూతిపరులు. రామారావుగారి స్మృత్యార్ధం ఏర్పాటు చేయబడి క్రమం తప్పకుండా నిర్వహింపబడుతున్న వార్షిక సమావేశం ఉపన్యాస కార్యక్రమంలో పాల్గొని మీ అందరితో కలిసి రామారావుగారికి శ్రద్ధాంజలి ఘటించి ఉపన్యసించే ఈ అవకాశాన్ని గొప్ప సత్కారంగా భావిస్తున్నాను. తన వృత్తిధర్మ నిర్వహణలో తల్లిదండ్రుల వారసత్వపు అడుగుజాడల ననుసరించి ‘వైద్యో నారాయణ’ అన్న ఆర్యోక్తికి ప్రతీకగా అందరి మన్ననలను పొంది ఈ వార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డా. స్టాలిన్ గారిని సభాముఖంగా అభినందిస్తున్నాను. నాకు ఈ సంవత్సరపు ఉపన్యాసం చేసే అవకాశాన్ని కల్పించిన డా. స్టాలిన్ గారికి,
రామారావుగారి సంస్మరణ సమితి సభ్యులకు ముందుగా నా కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

-కా.వెంకటేశ్వర్లు
25-9-1995


......................................................................................వివేకానందుని రచనలతో బాల్యంలోనే ప్రభావితమై మానవతా విలువలను సంతరించుకొని స్వాతంత్ర్య సమరంలో త్యాగాలు చేసిన చెలికాని రామారావు గారి సంస్మరణ సభలో పాల్గొని స్మారకోపన్యాసం యివ్వడం గర్వకారణంగా భావిస్తున్నాను.
-Ch. రాజేశ్వర రావు
శాసన సభ్యులు, 25-9-1996

 
...................................................................................
కేతు విశ్వనాధ రెడ్డి
సంఘ సంస్కరణ ఉద్యమం,జాతీయోద్యమం,వామపక్ష ఉద్యమాలలో ప్రముఖ పాత్రను రామచంద్రపురం వహించింది. సాహిత్యంలో అభ్యుదయ ఉద్యమానికి కూడా బాసటగా నిలిచింది. ఈ ఉద్యమాలన్నిటికీ స్పూర్తి నిచ్చిన డాక్టర్ చెలికాని రామారావు వర్ధంతి సభను ఆయన స్మారక సంఘం ప్రతి ఏటా నిర్వహించడం అంటే సమాజాన్ని మార్పు చేయగల చెలికాని రామారావు వ్యక్తిత్వాన్ని ఇప్పటి తరానికి అందజేయడ మన్నమాట.
డాక్టర్ చెలికాని రామారావు సంఘ సంస్కరణభావాల్ని ముందుకు తీసుకువెళ్ళినవారు. సనాతన ఆచారాల మీద తిరుగుబాటు చేసినవారు. జాతీయోద్యమంలో, వామపక్ష ఉద్యమాలలో క్రియాశీలంగా పాల్గొన్నవారు. ఆయన వ్యక్తిత్వంలో పునరుజ్జీవ చైతన్యం వుంది. మంచి కమ్యూనిస్టుగా ప్రగతిశీల క్రియాశీలక శక్తి వుంది. వీటికి డాక్టర్ చెలికాని రామారావు భార్య ‘కమలమ్మ’ తోడునీడగా నిలిచారు.....
కేతు విశ్వనాధ రెడ్డి
25-9-2001.............................................
డి.వి.వి.యస్. వర్మ
చెలికాని రామారావు గారి వర్ధంతి సభలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. అందుకు వారి కుటుంబ సభ్యుల్ని,నిర్వాహకుల్ని అభినందించాలి.ఎందుకంటే ఈ సభలో విలువైన ప్రసంగాలుంటున్నాయి. అంతకు మించి యీ సభలకు క్రమం తప్పకుండా హాజరయ్యే మిత్రులు చాలమంది వున్నారు. వీరందరిలోనూ ఏదో మంచి జరగాలన్న తపన, ఒక ఆదర్శాన్ని నిలబెట్టుకోవాలన్న ఆకాంక్ష, కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. ఈ సభల్లో ఒక్కసారి రామారావు గారి మూర్తిమత్వం ప్రత్యక్షం అవుతుంది. అది సభికుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మళ్ళీ ఒక ఆశావహమైన ప్రపంచం ఆవిష్కరించబడుతుంది.
రామారావుగారి జీవితం అందరికీ స్ఫూర్తి దాయకమైంది. ఒక మహోన్నత మానవతావాదిగా, గొప్ప సంస్కర్తగా, మంచి కమ్యూనిస్టుగా మనకు దర్శనమిస్తారు. ఇన్ని లక్షణాలు ఒక్కరిలో కలగలిసి ఉండటం అపురూపం. అందుకే వీరి జీవితం రాజకీయాలకు గౌరవాన్ని తెచ్చింది. వీరి త్యాగాలు రాజకీయాలకు సార్ధకతను తెచ్చాయి. ప్రస్తుతం రాజకీయాలపట్ల ప్రజల్లో ఏవగింపు పెరుగుతున్నది. సమాజహితానికీ, రాజకీయాలకు పొంతన లేదన్న ఆవేదన కలుగుతున్నది. ఇవి వెరసి పెద్దవైతే ప్రజాస్వామ్యానికి హాని జరుగుతుంది. రాజకీయపక్షాలు లేకుండా ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదు. అందుచేత మనం రాజకీయాలకి దూరంగా వుండకూడదు. మంచి రాజకీయం కోసం కృషి చెయ్యాలేగాని రాజకీయాలనే నిరసించకూడదు. రాజకీయాలతోనే సమాజహితం చేకూరుతుంది. అందుకు మరింత మంచి రాజకీయం, రాజకీయపక్షాలు అవసరం. స్వచ్ఛమైన పాలన అందించే సాధనాలుగా వీటిని తీర్చిదిద్దాలి. ఆమేరకు వాటిని ప్రక్షాళన చెయ్యాలి. ఇటువంటి బృహత్తర ప్రయత్నాలు సాగించాల్సిన సమయంలో రామారావుగారి స్ఫూర్తి మనకు కొండంత అండనిస్తుంది.
డి.వి.వి.యస్.వర్మ
25-9-2002


......................................


పొత్తూరి వెంకటేశ్వరరావు
చెలికాని వశం గురించి నేను మొదట విన్నది సుమారు ఇరవై యేళ్ళకు పూర్వం పాత పత్రికలను గురించి సమాచార సేకరణ ప్రారంభించినప్పుడు. పిఠాపురం నుంచి వెలువడిన ఒక సాహిత్య పత్రిక ‘ఆంధ్రభాషావిలాసిని’ గురించి తెలుసుకొన్న సందర్భం అది. చెలికాని లచ్చారావు గారు ఈపత్రిక వ్యవస్థాపకులు, సంపాదకులు. వారిది చిత్రాడ అనుకొంటాను. 1922-23 ప్రాంతంలో ఈ పత్రిక స్థాపించారు. వంగూరు సుబ్బారావు గారనే వాజ్మయ పరిశోధకుని సహకారంతో ఆయన అనేక అముద్రిత గ్రంధాలను వెలువరించి, సాహిత్య సేవ, భాషాసేవ చేశారు.తరువాత రామారావు గారిని గురించి విన్నాను. 1930 తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమం వేళ్ళూనిన కాలం. రామారావు గారు వామపక్ష భావాలవైపు అప్పటికే మొగ్గారు. తూర్పు గోదావరి జిల్లాలోనూ 1937-38 సంవత్సరాలలో రైతు, కూలీ ఉద్యమాలు అప్పుడే మొదలైనాయి. 1939 రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం. ఆ మరుసటి యేడాదే డాక్టర్ చెలికాని రామారావు దంపతులు రామచంద్రపురానికి నివాసం మార్చవలసి వచ్చింది. జీవిత భాగస్వామిని కమలమ్మగారు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తుండగా రామారావు గారు ప్రజాసేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు. సోవియట్ యూనియన్ పై హిట్లర్ సైన్యాలు దాడి చేసినప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోకెల్లా మొదటిసారిగా ఈ రామచంద్రపురంలో మరొక సహచరునితో కలిసి నిరసన ఏర్పాటు చేసినవారు చెలికాని రామారావు గారు. ఆంధ్రదేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర గ్రంధం ఈ సంఘటనను ఘనంగా పేర్కొన్నది. ‘ఒక మహోద్యమమునకు మానవ జీవితాన్ని అర్పించటం బహుసార్ధకము’ అని తన చిన్నతనములోనే అన్నకు రాసుకొన్న డాక్టర్ చెలికాని రామారావు గారు సహస్రచంద్ర దర్శనం చేసిన తన జీవితమంతా అదే ఆదర్శాన్ని పాటించారు. ధన్యమైన జీవితం ఆయనది. అటువంటి ఆదర్శపురుషులను స్మరించటం కొత్త తరాలకు స్ఫూర్తినిస్తుందని, యువతరంలో ప్రజాసేవాభిలాష ఉన్మీలనం కావటానికి దోహదం కలుగుతుందని నా విశ్వాసం.

పొత్తూరి వెంకటేశ్వరరావు
25-9-2003
.............................................................

No comments:

Post a Comment